కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖాన) ప్రారంభోత్సవం సందర్భంగా రాజకీయ వేడి రాజుకుంది. కార్యక్రమానికి హాజరైన ఎంపీ అర్వింద్ (MP Arvind) తన పేరు శిలాఫలకంపై చివరి వరుసలో ఉండటంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులు ఎవరికి వారు మద్దతుగా పోటాపోటీగా నినాదాలు చేశారు. అనంతరం ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు చేయవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు తెలియని నాయకులు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో తెలియదని.. జగిత్యాలకు వస్తే ఏ పార్టీ నాయకుడు ఏ నినాదం వినిపిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫ్లెక్సీల కోసం ఖర్చు చేసే డబ్బును గ్రామాభివృద్ధి, పల్లె దవాఖానా కోసం వినియోగిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఎంపీ సూచించారు. ప్రసంగం పూర్తయిన వెంటనే అర్వింద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనవసర వ్యాఖ్యలు అవసరమా?: ఎమ్మెల్యే సంజయ్
ఎంపీ అర్వింద్‌కు ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయాలకు రాకముందే ఎన్నో ఏళ్ల నుంచే వైద్య సేవలందిస్తున్నా. రేవంత్ ప్రభుత్వం పేదల పక్షపాతి. ధర్మాజిపేట గ్రామానికి 52 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇంటికి రూ.72 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చారా?. యూరియా యాప్ గురించి ఎంపీ అవహేళన చేసి మాట్లాడుతున్నారు. కేంద్రం నుంచి సకాలంలో సరఫరా చేసుంటే యాప్ అవసరమే ఉండకపోయేది. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలపై ఎందుకు మాట్లాడరు? కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? జగిత్యాల నియోజకవర్గంలో 14 పల్లె దవాఖానాలు తీసుకువచ్చా. ఎంపీ ఎన్ని తీసుకువచ్చారో చెప్పాలి. రాజకీయాలను పక్కనపెట్టి ఆసుపత్రి ప్రారంభించుకున్నాం. ఇలాంటి వేదికపై అనసరపు వ్యాఖ్యలు అవసరమా?’ అని మండిపడ్డారు.

