కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఉప్పర్‌పల్లి తాండలో మోతీమాత జాతర (Moti Matha Jathara) మొదలైంది. బంజారాలకు సంబంధించి ఈ జాతీయ ఎంతో ప్రత్యేకం. మూడు రోజులపాటు జాతర కొనసాగనున్నది. ప్రకృతి వైద్యంతో సేవలందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన మోతీమాతను దైవంగా భావించి ఈ జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గిరిజనులు వస్తుంటారు. తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా వచ్చి గిరిజనులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. బంజారా దుస్తులు ధరించి ఆటపాటలతో ఈ ఉత్సవాలు జరుపుకొని వెళ్తారు.
జాతర మొదటిరోజు తీపితో, రెండవ రోజు మేకలతో నైవేద్యంపెట్టి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. మూడో రోజు అగ్నిగుండం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని బంజారాలు నమ్ముతారు. వేల సంఖ్యలో గిరిజనులు జాతరలో పాల్గొంటారు. రెండు వందల ఏళ్ల క్రితం ప్రజలు అనేక రోగాల బారిన పడి మరణిస్తుంటే, వన మూలికలతో నాటు వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన మోతిమాత (Moti Matha Jathara) ఇక్కడే దేవతగా వెలసిందని గిరిజనుల నమ్మకం. సుమారు లక్ష మంది హజరైయ్యే ఈ జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రారంభమైన మోతిమాత జాతర ఈ నెల నాలుగో తేదివరకు నిర్వహిస్తారు.
Read Also: తలనొప్పికి అసలు కారణం బ్రెయిన్ కాదట!
Follow Us On: X(Twitter)


