కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం (Anantapur) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని యాడికి మండలం వేములపాడు (Vemulapadu) వద్ద ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. యాడికి మండలం రాయలచెరువు–వేములపాడు గ్రామాల రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘోరం జరిగింది. రైలు కింద పడిన సమయంలో తల్లి, ఒక కుమార్తె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో చిన్నారిని చికిత్స నిమిత్తం రాయలచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం అనంతపురం పట్టణానికి తరలిస్తుండగా మార్గమాధ్యలో ఆ చిన్నారి కూడా మరణించినట్లు తెలుస్తోంది. మృతురాలి వయసు 35 సంవత్సరాలు కాగా, చిన్నారుల వయస్సు 8, 10 సంవత్సారాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

