కలం, వెబ్ డెస్క్ : భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు షాకింగ్ న్యూస్ అందుతోంది. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతోందని (Monsoon Delay) వాతావరణ శాఖ తాజాగా అంచనా వేసింది. ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని తొలుత భావించినప్పటికీ.. రుతుపవనాలు అందుకు భిన్నంగా కదులుతున్నాయని పేర్కొంది. వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. జూన్ 10-12 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వివరించింది.
అయితే జూన్‌లో రుతుపవనాలు వచ్చినా.. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వేడి కొనసాగవచ్చునని వాతవారణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంటున్నారు. జూన్ లో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంటున్నారు. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షం ఉంటుందని చెబుతున్నారు.

