కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi) ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆసక్తికర సంఘటన జరిగింది. హనుమాన్ చాలీసా తరహాలో ప్రధాని నరేంద్ర మోదీ పేరిట పలువురు మోదీ చాలీసా (Modi Chalisa)ను విడుదల చేశారు. మోదీపై అభిమానంతో కొందరు వ్యక్తులు దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా వారు మోదీని దేవుడిగా ప్రకటించారు. అంతే కాకుండా అక్కడే రాముడి అవతారంలో ఉన్న నరేంద్ర మోదీ విగ్రహాన్ని కూడా ప్రదర్శించారు. ఆ విగ్రహానికి పూజలు చేసి, హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బీహార్ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు ట్రాన్స్‌జెండర్లు కూడా పాల్గొన్నారు. కాగా, ఈ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు మోదీ పేరిట ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మోదీ అభిమానులను చూస్తుంటే త్వరలో మోదీకి గుడి కట్టేస్తారని అనిపిస్తోందని సెటైర్లు వేస్తున్నారు. మోదీకి రాముడి వేషం వేసి ఇలాంటి పనులు చేసే బదులు రామాలయంలో నిధుల చోరీపై ప్రశ్నించాలని సూచిస్తున్నారు.

