కలం, వెబ్ డెస్క్: కారంలో రంపపు పొడి కలిపి మరీ విక్రయిస్తున్న కల్తీ ముఠాను మల్కాజ్ గిరి పోలీసులు (Malkajgiri Police) అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లిలో కల్తీ మసాలాలు తయారు చేస్తున్నారంటూ సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. రూ.25 లక్షల విలువైన సుమారు పది టన్నుల మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ బి.సుమతి తెలిపారు. ముఠా కార్యకలాపాలను వివరించారు.
ప్యాకెట్లు ఆకర్షణీయంగా..
మేడిపల్లి శ్రీనివాస్ నగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై జరిపిన దాడిలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. సత్యనారాయణ, రుద్రశేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు నాసిరకం పదార్థాలకు ఆకట్టుకునేలా ప్యాకింగ్ చేసి, బ్రాండ్ల పేరిట నమ్మిస్తూ మార్కెట్లోకి వదులుతున్నట్లు సీపీ సుమతి వివరించారు. వీరిపై ఆహార భద్రత, కల్తీ నిరోధక చట్టాల ప్రకారం కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు.
కొనేముందు ఇలా చేయాలి..
ఏ ఆహార పదార్థం కొనుగోలు చేసినా.. ముందు బ్రాండ్ పేరు, ఎప్పుడు తయారు చేశారు, గడువు, బ్యాచ్ నెంబర్, FSSAI వివరాలున్నాయో.. లేదో చెక్ చేసుకోవాలని సీపీ సుమతి వివరించారు. ప్యాకింగ్ సరిగ్గా లేకపోయినా, అనుమానం వచ్చినా కొనుగోలు చేయొద్దని, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతేగాకుండా, ఎక్కడైనా కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నట్లు సమాచారం వచ్చినా 8712662111 నెంబరుకి కాల్ చేస ఫిర్యాదు చేయాలని కోరారు.

