అక్టోబర్ రెండో వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం: కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్: అక్టోబర్ రెండో వారంలో పత్తి కొనుగోళ్లను (Cotton Procurement) ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ (Adilabad) వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషాలతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశ నిర్దేశం చేశారు. పత్తి కొనుగోళ్ల నేపథ్యంలో ఏఈఓ వద్ద ప్రత్యేకంగా మాయిశ్చరు మీటరును అందుబాటులో ఉంచామని, రైతులు అక్కడికి వెళ్లి తేమ శాతం చెక్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించారు.

మార్కెట్ యార్డులో రైతుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, భోజన వసతి వంటి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు కలెక్టర్ (Collector Rajarshi Shah)  వెల్లడించారు. తూకం సంబంధిత సమస్యల పరిష్కారం కోసం డిజిటల్ డిస్‌ప్లేలు, జిరాక్స్ సెంటర్లు, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్, కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ ఐడీ, ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు పాస్‌బుక్ తదితర ప్రాథమిక పత్రాలతో వస్తే మూడు రోజుల్లోగా ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయని తెలిపారు.

మహారాష్ట్ర రైతుల పత్తి కొనుగోలు కోసం ప్రత్యేకంగా కొన్ని జిన్నింగ్ మిల్లులను కేటాయించి, ఇరు ప్రాంత రైతుల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. దాదాపు 4 నెలల పాటు జరిగే ఈ కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు రాంపూర్ నుంచి మార్కెట్‌కు రావాలని కోరారు. ట్రాఫిక్ డైవర్షన్, బోర్డుల ఏర్పాటుపై పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ పరిశీలనలో జిల్లా మార్కెటింగ్ అధికారి గజానన్, సెక్రటరీ విఠల్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>