కలం, వెబ్ డెస్క్: కేంద్రం-రాష్ట్రం కలిసి పనిచేస్తే తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడంతో ప్రధాని స్పందించారు. “రాజకీయాలు మాట్లాడనని రేవంత్ రెడ్డి అన్నారు.. నేను కూడా అదే అంటున్నాను. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రం మీదా వివక్ష చూపలేదని.. గుజరాత్ కు కూడా నిధులు ఇచ్చారని.. అలాేగే ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరారు.
గుజరాత్‌కు ఇచ్చినన్ని నిధులు తెలంగాణకూ..
రేవంత్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకూ అంతే స్థాయిలో నిధులు ఇస్తామని ప్రధాని స్పష్టం చేశారు. “మాతో కలిసి పనిచేయండి.. తెలంగాణను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్దాం” అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. కేంద్రం రాజకీయ భేదాలు చూడదని, ప్రజల అభివృద్ధే తమ లక్ష్యమని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసినప్పుడే అది సాధ్యమన్నారు.
భారీగా శంకుస్థాపనలు
హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ దాదాపు రూ.9,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించిన జాతీయ రహదారి పనులు, రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

