కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలన దేశ చరిత్రలోనే స్వర్ణయుగమని ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి (MLC AVN Reddy), బీజేపీ అధికార ప్రతినిధి నాగేందర్ పేర్కొన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాలు అధికార పరిరక్షణకే పరిమితమయ్యాయని, మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను కేంద్రబిందువుగా చేసుకుని పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, దేశ భద్రత బలోపేతం, స్వదేశీ రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, ఎరువుల సబ్సిడీలు వంటి ఎన్నెన్నో కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ విజయాలకు నిదర్శనమన్నారు. కొవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించడం, స్వదేశీ వ్యాక్సిన్ తయారీ ద్వారా ప్రపంచానికి సహాయం చేయడం, చిన్న వ్యాపారులకు ముద్ర రుణాలతో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలకు దిక్సూచిగా భారత్..
బీజేపీ ప్రభుత్వాలు లేని రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు విచ్చలవిడిగా అమలు చేయడంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి ఆరోపించారు. దేశం నేడు ప్రపంచ వేదికపై గౌరవనీయ స్థానం సంపాదించిందని, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, అంతరిక్షం, క్షిపణి తయారీ రంగాల్లో దేశం ముందంజలో ఉందన్నారు. ఒకప్పుడు పేద దేశంగా చెప్పుకునే స్థాయి నుంచి నేడు ప్రపంచ దేశాలకే దిక్సూచిగా నిలవడానికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేశారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ మంజుల, పార్టీ రాష్ట్ర నాయకులు నాగరావు నామాజీ, రతన్యపాండ్ రెడ్డి, కొండయ్య, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, పగడాకుల శ్రీనివాసులు, రఘురామయ్య గౌడ్, లక్ష్మి తదితరులు ఉన్నారు.

