కలం, వెబ్‌డెస్క్: దేశానికి కరెంట్ పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని, నేడు దేశం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోందంటే ఆ కష్టం అంతా కాంగ్రెస్‌దేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) అన్నారు. ఇప్పుడు మధ్యలో వచ్చి నడుమంతరంగా మేమే కరెంటు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటే ప్రజలు ఎవరూ నమ్మరని చెప్పారు. రాష్ట్రంలో కరెంట్ కోతలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో వల్ల యావత్ ప్రపంచం ఇబ్బంది పడుతోందన్నారు. అంతటా కరెంట్ కష్టాలున్నాయని చెప్పారు. ఒక్కసారి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడాలని చెప్పారు.
ఇక తెలంగాణలో పవర్ ప్లాంట్లను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అద్దంకి దయాకర్ తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఏం చేశారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ కాంగ్రెస్ వస్తే కరెంటు రాదని మాట్లాడడం సరికాదని, కళ్లు తెరిచి వాస్తవాలు చూడాలని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో మొదటిసారి రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని వ్యాఖ్యానించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు కూడా ఉచిత విద్యుత్ అందించినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారని ఆరోపించారు.
అబద్ధాలను ప్రచారం చేయడానికి తప్ప బీఆర్ఎస్ నేతలు దేనికీ పనికిరారని అద్దంకి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు ప్రతిబంధకంగా మారాయన్నారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి డిస్కంలను నష్టాలపాలు చేశారని ఆరోపించారు. విద్యుత్ శాఖను అవినీతి, అక్రమాలకు నిలయంగా మార్చారని మండిపడ్డారు. ఇప్పుడు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎంత ధర చెల్లించైనా విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు.

