మహబూబ్‌నగర్ ఆసుపత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్(Mahbubnagar)  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas) తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కూడా పాల్గొన్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ‘యెన్నం హెల్త్‌కిట్’ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి నెల తప్పనిసరిగా హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి వార్డుకు అవసరమైన పరికరాల వివరాలను హెచ్‌వోడీలు సమర్పిస్తారని, వాటి ఆధారంగా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.

ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఆశా వర్కర్ల కోసం ప్రత్యేక షెడ్‌తో పాటు అటెండెంట్ల కోసం అదనపు షెడ్ నిర్మిస్తామని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 900 మందికి ‘యెన్నం హెల్త్‌కిట్’ లు అందించామని, ప్రసవం జరిగిన తల్లులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పట్టణంలోని నర్సింగ్ హోమ్స్, ప్రైవేట్ వైద్యులతో చర్చించి సుమారు 25 మహిళల ఆసుపత్రులు, 30 పిల్లల ఆసుపత్రులలో ఉచిత ఓపీ సేవలు అందించేందుకు హెల్త్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్‌తో పాటు ప్రైవేట్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

మహబూబ్‌నగర్ నగరంలో విద్య తర్వాత హెల్త్‌కేర్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వచ్చే 6 నెలల నుంచి ఏడాదిలో గణనీయమైన మార్పులు తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. పేద కుటుంబాల నుంచి ఎక్కువగా వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, ఇంచార్జీ డీఎంహెచ్‌వో డాక్టర్ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>