కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పేదల సొంతింటి కలలను సాకారం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. గురువారం మహబూబ్ నగర్ లోని ఎదిర డివిజన్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదలకు సొంతింటి కల సాకారం కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సొంతింటి హామీలు మాటలకే పరిమితమై, పేదల కలలు కలగానే మిగిలిపోయాయని విమర్శించారు. ఉత్తుత్తి హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్న ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నిజం చేస్తోందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో గుడిసెలు లేని గ్రామాలు నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, కార్పొరేటర్ లలిత భానుచందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

