Mobile Popup Ad
Mobile Popup Ad

రెంజల్ KGBVలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. పరిశుభ్రతపై ఆగ్రహం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nijamabad) జిల్లా రెంజల్ (Renjal) లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసరాలను, కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, తరగతి గదులను పరిశీలించారు. పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థినులు పాములు, విష కీటకాల బారినపడితే ఎవరు బాధ్యులని నిలదీశారు. వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, వర్షపు నీరు నిలువ ఉన్న గుంతలలో దోమలు వృధ్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది అటెండెన్స్ వివరాలను అడిగి తెలుసుకుని, మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. నాసిరకం బియ్యం, సరుకులు సరఫరా చేస్తే వెంటనే మండల అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్ నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, మరమ్మత్తులు చేయించాలని అన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, తాను వారం రోజుల తర్వాత మళ్లీ పాఠశాలను సందర్శిస్తానని, ఆలోగా అన్ని లోటుపాట్లను చక్కదిద్దుకోవాలని సూచించారు. అనంతరం పదవ తరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి, విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బహుమతులను అందించారు.

చక్కగా చదువుకోవాలని, వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని బాలికలకు జాగ్రత్తలు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాలికలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఈగలు వృద్ధి చెందకుండా వంటగది, డైనింగ్ హాల్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక తహశీల్దార్ శ్రవణ్, ఎంపీడీఓ కమలాకర్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్యామల తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>