కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టుల సేవలు అమోఘమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే (Mahabubnagar MLA) యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ప్రెస్‌క్లబ్ బాధ్యుల విజ్ఞప్తి మేరకు ఎస్వీఎస్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సౌజన్యంతో జిల్లాలోని జర్నలిస్టులు, వారి సతీమణుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ప్రజా సంక్షేమమే నిజమైన నాయకత్వ లక్షణం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారాన్ని వినియోగిస్తూ సామాన్య ప్రజలతో మమేకమై పనిచేయడమే నిజమైన నాయకత్వమని అన్నారు. సమాజ హితం కోసం నిరంతరం పనిచేసే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు సమగ్ర మాస్టర్ హెల్త్ చెకప్‌ను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన ఎస్వీఎస్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. తక్కువ ఖర్చుతో అత్యున్నత వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం..
నాగం జనార్దన్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఏర్పాటైన SVS మెడికల్ కాలేజీ, ఆసుపత్రి రెండు దశాబ్దాలకు పైగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు విశేష వైద్య సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో ఇలాంటి మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఉండటం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా స్థానికంగానే అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు SVS ప్రాంగణంలో కొత్త వైద్య పరికరాలు, సదుపాయాలను సమకూరుస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చేలా SVS వైద్య సేవలపై మీడియా విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. చిన్న ఆరోగ్య సమస్యలను సైతం నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
జర్నలిస్టులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి..
జర్నలిస్టులు తీవ్ర పని ఒత్తిడి, న్యూస్ కాంపిటీషన్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని SVS ఆసుపత్రి ఎండీ డాక్టర్ కేజీ రెడ్డి అన్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. SVS ఆసుపత్రిలో సుమారు రూ.80 కోట్లతో అత్యాధునిక వైద్య సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకండా క్యాన్సర్ వైద్యం..
హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా క్యాన్సర్ చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏడాది కాలంలో SVSలో రేడియోథెరపీ, కీమోథెరపీ సదుపాయాలతో కూడిన అత్యాధునిక క్యాన్సర్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడైనా SVS ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.
పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాకిట అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ నగర మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్, SVS ఆసుపత్రి రెసిడెంట్ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ బెక్కెరి అనిత, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నరేందర్ చారి, కాంగ్రెస్ నేతలు మైత్రి యాదయ్య, వాల్దాస్ ప్రతాప్ గౌడ్, పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

