కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణం నుంచి హన్వాడ మండలంలోని బుద్దారం గ్రామానికి నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త ఆర్టీసీ బస్సు (RTC Bus Service) ను దాచక్‌పల్లి గ్రామంలో ఆయన బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో కొత్త బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన బస్సు మహబూబ్‌నగర్ నుంచి బోయపల్లి, మహ్మద్ ఖాన్‌పల్లి, వెంకటమ్మ కుంట తండా, కొత్తపేట, దాచక్‌పల్లి, గుడ్డిమల్కాపూర్, టంకర, బుద్దారం గ్రామాల మీదుగా హన్వాడ మండల కేంద్రానికి చేరుకుని, అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు రాకపోకలు సాగిస్తుందని వివరించారు. ఈ సర్వీసు ద్వారా ప్రతిరోజూ రెండు ట్రిప్పులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల ప్రజల, విద్యార్థుల, మహిళల, ఉద్యోగుల 18 సంవత్సరాల కల సాకారం అయిందని తద్వారా ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద అర్హులైన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్‌పీ వెంకటేష్, హన్వాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు చెన్నయ్య, గ్రామ సర్పంచ్ శ్రీలత కృష్ణయ్య, డీసీసీ కార్యదర్శి జె.వెంకటయ్య, మండల బీసీ సెల్ చైర్మన్ తిరుపతయ్య, నాయకులు మైత్రి యాదయ్య, టంకర కృష్ణయ్య యాదవ్, మల్లయ్య, సర్పంచులు బొట్టు వెంకట్, లింగం నాయక్, ఎంపీడీవో, ఆర్టీసీ అధికారులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

