కలం, నకిరేకల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నకిరేకల్ పట్టణంలో భారీ మారథాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) ముఖ్య అతిథిగా పాల్గొని, జెండా ఊపి ప్రారంభించడంతో పాటు స్వయంగా ర్యాలీలో నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ, నేరుగా ప్రజల చెంతకే చేరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
క్రీడలు, వ్యాయామంతో మానసిక దృఢత్వం
యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి క్రీడలు, వ్యాయామం ఎంతగానో తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. నేటి ఆధునిక కాలంలో ఇలాంటి మారథాన్ కార్యక్రమాలు యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయని వివరించారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంతో పాటు, ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యతను గుర్తు చేసే ఉద్దేశంతోనే ఈ మారథాన్ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని వీరేశం (MLA Vemula Veeresham) తెలిపారు. ఈ మారథాన్ ర్యాలీకి పట్టణ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
Read Also: మద్యం రేట్ల పెంపుపై ఎక్సయిజ్ శాఖ ఎక్సర్‌సైజ్!
Follow Us On: WhatsApp

