ఒక నోట మెచ్చు కోలు, మరో నోట నొచ్చుకోలు…పెరిగిన హోదా, తరగని బాధ!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి (Khammam Hospital)లో వింత పరిస్థితి నెలకొంది. ఈ ఆసుపత్రిలో వైద్యం బాగుందంటూ, కొందరు మెచ్చుకుంటుండగా, మరికొందరు మాత్రం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నోచ్చుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు పొరుగునే ఉన్న సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల పేద ప్రజలకు ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి ఒక నమ్మకమైన వైద్య సంజీవని. 2023 సెప్టెంబర్ 15న ఈ ఆసుపత్రికి అనుబంధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించిన తర్వాత ఇక్కడి సేవల నాణ్యత పెరిగింది. ప్రొఫెసర్లు, నిపుణులైన డాక్టర్ల సంఖ్య పెరగడంతో గతంలో లేని పలు సూపర్ స్పెషాలిటీ సేవలు ఇప్పుడు పేదలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే, నాణ్యమైన వైద్యం అందుతున్నప్పటికీ.. మౌలిక వసతుల లోపం, సిబ్బంది నిర్లక్ష్యం ఈ ఆసుపత్రి కీర్తిని మసక బారుస్తున్నాయి.

హాస్పిటల్ (Khammam Hospital) ఆవరణలోనే ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రం అత్యుత్తమ ప్రసవాల సంఖ్యతో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా వందలాది రక్త, మూత్ర పరీక్షలు ఉచితంగా సాగుతున్నాయి. కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం ఎందరో పేద రోగుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. నిత్యం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు (నిర్ణీత సమయం కంటే అదనంగా) ఓపీ కౌంటర్లు తెరిచి ఉంచడం, రోగులందరినీ చూశాకే క్లోజ్ చేయడం అనేది ఒక రకంగా మెచ్చుకునే అంశమే, ప్రస్తుతం ఆసుపత్రిని ఎదుర్కొంటున్న అతిపెద్ద సాంకేతిక సమస్య ‘లో-వోల్టేజ్’. ప్రస్తుతం ఇక్కడ కేవలం 150 కేవీ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల ఏసీలు, ఎక్స్-రే మిషన్లు తరచుగా మొరాయిస్తున్నాయి.

ఇటీవల ఒక ఎక్స్-రే మిషన్ చెడిపోవడంతో రోగులు ఏకంగా 20 రోజుల పాటు నానా ఇబ్బందులు పడ్డారు. దీనిని వెంటనే 250 కేవీ ట్రాన్స్ఫార్మర్ కు అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ వైద్యాధికారులతో పాటు రోగులు కూడా కోరుతున్నారు. రోజుకు వేలాది మంది వచ్చే ఈ ఆసుపత్రిలో కేవలం 3 ఎక్స్-రే మిషన్లు (ఇందులో ఒకటి మొబైల్ మిషన్) మాత్రమే ఉన్నాయి. అలాగే అత్యంత కీలకమైన సీటీ స్కాన్ మిషన్ ఒక్కటే ఉంది. ఇక అత్యవసరమైన ఎమ్ఆర్ఐ స్కానింగ్ సేవలు అసలు లేవు. ప్రభుత్వం ఎంఆర్ఐ మంజూరు చేసినప్పటికీ, అది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం నుంచి సకాలంలో మందుల సరఫరా అందకపోవడం మరో పెద్ద మైనస్. అత్యవసర మందుల కోసం అధికారులు స్థానిక ప్రైవేట్ షాపులపై ఆధారపడుతున్నారు. ఇందుకోసం నెలకు దాదాపు రూ. 2 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేసి, ఆ తర్వాత బిల్లులు పెట్టి నిధులు రాబట్టుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని కీలకమైన మందులు లేకపోవడంతో పేద రోగులు బయట కొనుక్కోవాల్సి వస్తోంది.

ముత్తులింగం, మంగళగూడెం, ఖమ్మం

మోకాళ్ళ తీపులు, బీపీ చూపించుకోవడానికి వచ్చాను. విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పినా, కేవలం మందులు రాసి పంపించి వేస్తున్నారు. ఎక్స్ రే తీయమని అడిగితే, మళ్ళీ రేపు రమ్మని చెప్తున్నారు. దీనికంటే ప్రైవేట్ ఆసుపత్రి నయం. అక్కడ ఒక్కరోజులోనే అన్ని పరీక్షలు చేస్తారు.

కృష్ణా, ట్రాక్టర్ డ్రైవర్ పాతర్లపాడు,చింతకాని మండలం

కిందపడడం వల్ల కాలు విరిగింది. బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే రూ.80 వేలు అవుతాయని చెప్పారు. అందుకే ఇక్కడకు వచ్చాను.ఇక్కడ అన్నీ ఫ్రీగా చేశారు. ఇక్కడే బెడ్ మీద పది రోజులు వున్నాను. చికిత్స, మందులతో పాటు భోజనం కూడా ఉచితంగానే పెట్టారు. అయితే కొన్ని మందులు ఇక్కడ లేకపోవడంతో బయట కొనుక్కున్నాను.

మల్లమ్మ, పోచారం, ఏనుకూరు మండలం

కళ్ళు తిరుగుతున్నాయి. ఒళ్ళు నొప్పులు ఉన్నాయని వచ్చాను. బీపీ, షుగర్ టెస్ట్ లు రాశారు. షుగర్ టెస్ట్ చేయమని ల్యాబ్ కు వెళ్తే, వాళ్ళు రేపు రమ్మని చెప్తున్నారు. రేపు మళ్ళీ ఏనుకూరు నుంచి రావాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఇప్పటికే రెండు రోజుల నుంచి తిరుగుతున్నాను.

జీ.కుమారి, వైఎస్ఆర్ కాలనీ, ఖమ్మం

కేన్సర్ టెస్ట్ కోసం శాంపిల్ ఇచ్చి 45 రోజులైంది. ఇవ్వాళ రమ్మన్నారు. వస్తే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. బయట కూర్చో అని అవమానంగా మాట్లాడుతున్నారు. కొంతమందినీ మాత్రం లోపలికి రానిస్తున్నారు, గంట సేపటి నుంచి ఇక్కడ నిల్చొని ఉన్నాను. రిపోర్ట్ లో ఏమొస్తుందో, అనే టెన్షన్ ఒక వైపు, సిబ్బంది నిర్లక్ష్యపు మాటలు మరో వైపు బాదిస్తున్నాయి.

ఏ ఓ సంతోష్, ఖమ్మం జిల్లా ఆసుపత్రి

ఆసుపత్రిలో (Khammam Hospital) ఏంఆర్ఐ స్కానింగ్ లేదు. ప్రభుత్వం శాంక్షన్ చేసింది కానీ, ఎప్పుడు వస్తుందో, తెలియడం లేదు. వీలైనంత తొందరగా ఏర్పాటు చేస్తే బావుంటుంది. అలాగే ఇంకో రెండు ఎక్స్ రే మిషన్లు కూడా అవసరం ఉంది. వీటి కోసం కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. లో ఓల్టేజ్ సమస్య కూడా ఉంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మందుల సమస్య ఉంది. కానీ పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా లోకల్ గా పర్చెజ్ చేసి, అందుబాటులో ఉంచుతున్నాము.

​ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ భౌతికంగా మెడికల్ కాలేజీగా ఎదిగినా, క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల లోపాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరించి, అదనపు ఎక్స్-రే, సీటీ స్కాన్, మందులను అందుబాటులోకి తేవడంతో పాటు… రోగులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పుడే ఈ “వైద్య సంజీవని” పూర్తి స్థాయిలో పేదల చెంతకు చేరుతుందనీ జిల్లా ప్రజలు, రోగులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా హాస్పిటల్ లో స్టాఫ్, వసతుల వివరాలు:

ప్రొఫెసర్లు: 36
​సీనియర్ డాక్టర్లు: 37
​పీజీ డాక్టర్లు: 31
​హౌస్ సర్జన్లు: 22
​నర్సింగ్ సిబ్బంది: 230
ల్యాబ్ టెక్నీషియన్ లు: 25
ఎక్స్ రే సిబ్బంది: 5
సీ టీ స్కాన్ సిబ్బంది: 2
అంబులెన్సు లు :2
బెడ్స్: 620

Read Also: BRS చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారింది: రామ్‌చందర్ రావు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>