కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) చైతన్యపురిలోనీ శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువైవున్న మహిమాన్విత దివ్య క్షేత్రం ‘శ్రీ మహాశక్తి దేవాలయం’ వరలక్ష్మీ వ్రత వేడుకలతో జనసంద్రంగా మారింది. శ్రావణ శుక్రవారం, శ్రీ వరలక్ష్మీ వ్రత పూజ భక్తిశ్రద్ధలు, సంప్రదాయ వైభవం మధ్య ఈ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. వరలక్ష్మీ వ్రత వేడుకలను పురస్కరించుకుని ఉదయం 7:30 గంటలకు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి, ఘనంగా మహా హారతి నిర్వహించారు.
సాయంత్రం 6:30 గంటలకు ప్రధాన వేడుకగా వరలక్ష్మీ వ్రతము (Varalakshmi Vratham), సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను అత్యంత భక్తిప్రపత్తులతో చేపట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈ పవిత్ర వేడుకలను దేవాలయ నిర్వాహకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణాన్ని ఆకర్షణీయమైన పూల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
శ్రీ మహాశక్తి దేవాలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తుల పాలిట ‘కొంగు బంగారం’గా విరాజిల్లుతున్నారు. ఇక్కడ వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఇంటా సుఖశాంతులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతోనే చుట్టుపక్కల ప్రాంతాల నుండి మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా భక్తుల సందడితో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవార్లకు ఓడి బియ్యం సమర్పించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

