కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) పిలుపునిచ్చారు. బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లో తహసీల్దార్ సమక్షంలో బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌ఓ) తన వ్యక్తిగత ఓటరు వివరాలను ఆయన స్వయంగా అందజేశారు. ఒక ఫారాన్ని అధికారులకు సమర్పించి, రసీదుగా మరో ఫారాన్ని తన వద్ద ఉంచుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా సర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. ఈ సందర్బంగా అధికారులకు, బీఎల్ఓ, బీఎల్ఏలకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఓటర్లు తమ వివరాలను ఈ నెల 23వ తేదీ లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, బీఎల్‌ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్యుమరేషన్ ఫారాన్ని నింపి వారికి ఇవ్వాలన్నారు.
మొత్తం రెండు ఫారాలు ఉంటాయని, ఒకటి బీఎల్‌ఓకు అందజేసి, అధికారుల సంతకం ఉన్న మరో ఫారాన్ని (రసీదు) ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఫారాలు నింపి, అధికారులకు సమర్పించకపోయినా లేదా ఆన్‌లైన్‌లో నమోదు కాకపోయినా ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. ఓటర్లు ఈ ప్రక్రియను తేలికగా తీసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల తహసీల్దార్ అనిరుధ్, బీఎల్ఓలు, సర్పంచ్ అశోక్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

