కలం, నిజామాబాద్ బ్యూరో: రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా, నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం మెండోరా మండలంలోని దూద్‌గావ్, కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. గత 10 రోజులుగా ధాన్యం కుప్పలు పోసి ఉన్నా.. గన్ని బ్యాగులు (బార్దాన్) లేవని, లారీలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే దీనిపై తక్షణమే స్పందించి జిల్లా అధికారి డిఎస్ఓ (DSO) తో అక్కడి నుండే ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. పెద్ద గ్రామమైన దూద్‌గామ్ లో గన్ని బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని, కేవలం 6 వేల సంచులు మాత్రమే పంపడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే సరిపడా బార్దాన్ లు పంపాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి కేవలం 3 లారీలు మాత్రమే రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 50 నుండి 60 లారీల ధాన్యం నిల్వ ఉందని, వెంటనే లారీల సంఖ్య పెంచాలని కోరారు.
‘తరుగు తీస్తున్నారు – కలెక్టర్ హామీ ఇచ్చినా మార్పు లేదు’
నిజామాబాద్‌లోని పలు రైస్ మిల్లుల్లో క్వింటాల్‌కు 3 నుండి 4 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. 41.5 కిలోలకు బదులు 45.5 కిలోల వరకు నింపుతున్నారని, ఇది రైతులను నిలువునా ముంచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం వెంటనే తరుగు 41.5 కంటే మించి లేకుండా ధాన్యం దించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. దూద్‌గామ్ సరిహద్దు గ్రామం కావడంతో అధికారులు ఇక్కడి రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని, నిన్న కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇకపై జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ”సంచిలో 41.5 కిలోలు మాత్రమే తీసుకోవాలి” అని కలెక్టర్ స్పష్టమైన హామీ ఇచ్చారు, కానీ క్షేత్రస్థాయిలో మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై 44 కిలోల పైగా తీసుకుంటూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ”వెంటనే మోర్తాడ్, దూద్‌గామ్ కేంద్రాల నుండి ధాన్యం తరలింపు చేపట్టాలి. తరుగు పేరిట అదనంగా ఒక్క కిలో తీసుకున్నా ఊరుకోం” అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన
కోనసముందర్ కేంద్రంలో ఇప్పటికే నాలుగు లారీలు లోడ్ అయ్యాయని, రాబోయే ఐదు రోజుల్లో అక్కడి కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కలెక్టర్ 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, అధికారులు 8 రోజులనే టార్గెట్‌గా పెట్టుకుని పని చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నొక్కి చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా, సకాలంలో మిల్లులకు చేరేలా నిరంతరం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పరిశీలిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, రైతులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
మార్కెఫెడ్ DM తో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మెండోరా మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను, రైతుల సమస్యలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న గన్నీ బ్యాగుల కొరతను గమనించిన ఆయన, తక్షణమే సంబంధిత ఉన్నతాధికారి మార్కెఫెడ్ DM తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెండోరా మండల కేంద్రంలో రైతుల వద్ద సుమారు 10 నుండి 12 వేల మొక్కజొన్న బస్తాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే సంచుల కొరత కారణంగా కొనుగోలు ప్రక్రియ ఆగిపోయిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో తాను కోరిన వెంటనే కిసాన్ నగర్ క్లస్టర్ కు గన్నీ బ్యాగులు పంపించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూనే, అదే విధంగా మెండోరా గ్రామానికి కూడా వెంటనే 12,000 సంచులను పంపించాలని కోరారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజను కొనుగోలు చేసేలా అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.

