కలం, వరంగల్ బ్యూరో: వరంగల్(Warangal)లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్తున్నారు. దీంతో మహిళలు సింగిల్‌గా బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. చోరీలు అరికట్టాల్సిన పోలీసులు నేరం జరిగిన తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా దొంగల ఫొటోలు విడుదల చేసి పట్టించిన వాళ్లకు నజరానాలు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యల పై నగర వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒంటరి మహిళలే టార్గెట్..!
గత రెండు నెలలుగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. పట్టపగలే బైక్‌లపై వచ్చి మహిళల మెడలోని గొలుసులు లాక్కుపోతున్నారు. ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ రోడ్, కుడా రోడ్, హంటర్ రోడ్, కాజీపేట బస్టాండ్, సుబేదారి, మట్టెవాడ ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదయం 6-9 గంటలు, సాయంత్రం 5-8 గంటల మధ్య వాకింగ్, మార్కెట్‌కు వెళ్లే మహిళలే టార్గెట్ చేసి తమ చోర కళను ప్రదర్శిస్తున్నారు. పల్సర్, అపాచీ బైక్‌లపై ఇద్దరు యువకులు వచ్చి, ఒక్కసారిగా గొలుసు లాగేసి వేగంగా పారిపోతున్నారు. దొంగలు హెల్మెట్, మాస్క్‌తో ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తగ్గిన నిఘా
ప్రస్తుతం వేసవి సెలవులు, ఎండ తీవ్రత వల్ల పోలీస్ పెట్రోలింగ్ తగ్గించారు. దీంతో చైన్ స్నాచర్లు ఈజీగా తమ పని కానిస్తున్నారు. పోలీస్ నిఘా తక్కువగా ఉన్న ప్రదేశాలు, నగర శివారు ప్రాంతాలను ఎంపిక చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడంతో ఈజీ మనీ కోసం స్నాచర్లకు నేరాలకు పాల్పడుతున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా ప్రాంతాల నుంచి వస్తున్న యువకులు ఇక్కడ వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి ఊళ్లకు వెళ్తున్నారు. కొంతకాలం తర్వాత అంతా సద్దుమణిగాక మళ్ళీ ఇక్కడికి వచ్చి నేరాలకు దిగుతున్నారు.
పోలీసుల వైఫల్యం
పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. సాదా దుస్తుల్లో పోలీసులు వాకింగ్ ట్రాక్‌లు, రద్దీ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నారు. పాత కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వారంలోనే మట్టెవాడ, సుబేదారి పోలీసులు ఇద్దరు స్నాచర్లను అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గర 15 తులాల బంగారం రికవరీ చేశారు. అయితే దొంగతనాలు అరికట్టేందుకు సీసీఎస్ అనే ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. అనుభవంలేని సిబ్బంది వల్ల నేరాల సంఖ్య తగ్గడం లేదనే వాదనలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు.

