కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) జిల్లా విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయం దోహదపడుతుందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. వనపర్తి పట్టణంలోని నాగవరం శివారులో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) , జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన అధికారికంగా ప్రారంభించారు. నాలుగు నెలల క్రితమే విద్యాబోధన ప్రారంభమైనప్పటికీ, సోమవారం అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ తరగతి గదులను పరిశీలించి విద్యాబోధన, విద్యార్థుల ప్రవేశాలు, పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ వనపర్తికి కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం సంతోషకరమన్నారు. తక్కువ సమయంలోనే విద్యాలయాన్ని ప్రారంభించి విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. విద్యాలయ నిర్వహణకు అవసరమైన భవనాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారని తెలిపారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ బోధన అందుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఎంపీ మల్లు రవి ఢిల్లీలో చేసిన కృషి కీలకమైందన్నారు. ఇప్పటికే ప్రవేశాలు పూర్తిచేసుకొని విద్యాలయం కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే సొంత భవనం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఎంపీ సహకారంతో రూ.9 కోట్ల విలువైన సీఎస్ఆర్ నిధుల ద్వారా విద్యాలయానికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని, ఇందుకోసం అనువైన స్థలాన్ని కూడా పరిశీలించామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు నిర్దేశించిన ప్రమాణాలను పరిశీలించిన అనంతరమే అనుమతులు లభిస్తాయని తెలిపారు.
వనపర్తిలో అవసరమైన ప్రమాణాలను చూపించడంతో విద్యాలయం ఏర్పాటు సాధ్యమైందన్నారు. ఈ విద్యాలయం ఏర్పాటులో ఎంపీ, ఎమ్మెల్యే సహకారం అభినందనీయమన్నారు. ప్రవేశాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో నిబంధనల ప్రకారం లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేసినట్లు వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యాలయానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్‌చైర్మన్ మధుసూదన్‌గౌడ్, మాజీ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

