పాలేరు అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి సమీక్ష

కలం, ఖమ్మం బ్యూరో : పాలేరు (Paleru) నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ఇంజనీరింగ్, ఇరిగేషన్, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పనుల పురోగతి, ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, నిధుల మంజూరుపై విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి పనులకు ఎదురవుతున్న భూసేకరణ తదితర సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో వెంటనే పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను త్వరితగతిన షిఫ్ట్ చేసేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల వల్ల భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు అన్యాయం జరగకుండా, భూమికి బదులు భూమి, ఇంటికి బదులు ఇల్లు ఇచ్చేలా వేగవంతమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలో పనుల బిల్లుల చెల్లింపులకు ఎలాంటి నిధుల కొరత లేకుండా చూసేందుకు ప్రతి నెలా రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున నీరు, విద్యుత్‌ను అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు రెండో పంట వేయకూడదని, ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలియజేసి స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సి.ఈ. వాసంతి, ఎస్.ఈ. ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్.ఈ. యుగంధర్ రావు, పి.ఆర్. ఎస్.ఈ. వెంకట్ రెడ్డి, విద్యుత్ ఎస్.ఈ. ఇనుగుర్తి శ్రీనివాసా చారి, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఈ. శేఖర్ రెడ్డి, మెడికల్ ఇ.ఈ. ఉమామహేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>