కలం, వరంగల్: ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని, మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి (Revuri Prakash Reddy) స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల రైతు వేదికలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా గవిచర్ల, తీగరాజు పల్లి, సోమ్లా తండా, పెద్ద తండా గ్రామాలలో నిర్మించనున్న మహిళా సమైక్య భవనంలకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకముందు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా సంఘాల వ్యవస్థ ప్రారంభమైనదని, దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళల ద్వారా సాధ్యమవుతుందన్నారు.
రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పరిమితిని రూ 5 లక్షల నుండి 10 వరకు పెంచి, బ్యాంకు రుణాల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళలకు ఉచితబస్ ప్రయాణం, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, రైస్ మిల్లులు, మహిళా శక్తి సూపర్ బజార్లు, మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కు అనుగుణంగా ఆధునిక వసతులతో గ్రామ మహిళా భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సంగెం మండల మహిళా సమైక్యకు బస్సు కొనుగోలు ద్వారా నెలకు దాదాపు 65 వేల ఆదాయం వస్తుందని అన్నారు. పరకాల మహిళా డైరీ ఏర్పాటు మహిళలపై పూర్తి నమ్మకంతో ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి మహిళా భాగస్వామ్యం కావాలని కోరారు. సీఎం రేవంత్ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధికి తోడ్పడే మహిళా సమైక్య భవనాలు ఉపయోగపడతాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

