ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ సమీక్ష

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు చేరుతున్న ధాన్యం లారీలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే అన్‌లోడింగ్ చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్(Vinod Kumar) ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసే చర్యలలో  భాగంగా వనపర్తి (Wanaparthy) జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మంగళవారం పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల పరిధిలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంబాలపూర్, శ్రీరంగాపూర్, రంగాపూర్, పెబ్బేరు ప్రాంతాల్లోని రైస్ మిల్లులను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యం లారీల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం, అలాగే మిల్లులలో అదనపు నిల్వ స్థలాల లభ్యతపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం లారీలను ఎక్కువసేపు వేచి ఉండనీయకుండా వెంటనే అన్‌లోడింగ్ పూర్తి చేయాలని సూచించారు. రాబోయే రోజులలో ధాన్యం నిల్వకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అదనపు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలని మిల్లర్లకు ఆదేశించారు. లారీల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో హమాలీల సంఖ్యను పెంచి అన్‌లోడింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మిల్లుల ఆవరణలోని గోదాములు, ఖాళీ స్థలాలను పరిశీలించి అదనపు ధాన్యం నిల్వకు అనుకూలంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం తరుగు, తూకం విషయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈ తనిఖీలలో  స్థానిక తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>