Mobile Popup Ad
Mobile Popup Ad

ముదిరాజ్‌లే తెలంగాణలో అతిపెద్ద కులం: ఈటల

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అతిపెద్ద కులం ముదిరాజ్ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) పేర్కొన్నారు. మన సామాజికవర్గం ఒక్క మాట మీద ఉంటే ప్రభుత్వం దిగివస్తుందని పేర్కొన్నారు. ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్‌లు మొత్తం ఒకే సంఘంగా ఉండాలని కోరారు. వేర్వేరు సంఘాలుగా ఉంటే రాజకీయాలు అంటగడుతున్నారని పేర్కొన్నారు. ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జలవిహార్‌లో జరిగిన “ముదిరాజ్ సింహావలోకనం” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఈటల మాట్లాడారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ దినేష్, డాక్టర్ శివకేశవ్, ఉప్పరి నారాయణ, జగన్ ముదిరాజ్, ముదిరాజ్ విద్యార్థుల వేదిక కన్వీనర్ జూలు నాగేశ్వర్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. ముదిరాజులను బిసీ-డీ నుంచి బీసీ-ఏ‌కు మార్చాలనే ప్రధాన డిమాండుతో జలవిహార్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు ముదిరాజ్ సంఘాల నాయకులు, విద్యావంతులు, మేధావులు పాల్గొన్నారు.

ముదిరాజ్‌లు వెనుకబడ్డారు

ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారమే ముదిరాజ్ లు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తేల్చిందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ (Eatala Rajendar) మాట్లాడుతూ .. ‘ఎన్నో ఏళ్లుగా ముదిరాజ్‌లు హక్కుల కోసం కొట్లాడుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. రోషంలో, సాహసంలో కొదవలేదు కానీ మనం ఎక్కడ ఉన్నాము పునరాలోచన చేసుకోవాలి. అప్పట్లో బండ ప్రకాశ్ ముదిరాజులు కోసం పేపర్లు పట్టుకొని అసెంబ్లీ చుట్టూ తిరిగే వారు. బీసీ డీ నుంచి బీసీ ఏ కి మార్చాలని మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడింది నేనే. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అనేకసార్లు అసెంబ్లీలో ఈ సమస్యలను ప్రస్తావించాను. 2008లో ఉప ఎన్నికల సందర్భంగా రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ అందినట్టే అంది దూరం అయ్యింది.’ అంటూ ఈటల పేర్కొన్నారు.

మేము ఏ కులాన్ని ద్వేషించబోము

సీజను వారీగా పండ్లు, కూరగాయలు అమ్ముకొని రెక్కల కష్టం నమ్ముకుని బ్రతికే వాళ్ళు ముదిరాజులు. మాది మాకు కావాలని మాత్రమే అడుగుతున్నాం. నేను ఎల్లప్పుడూ న్యాయం పక్షాన ఉంటాను. ఈ జాతి అనేక సంవత్సరాలుగా అక్రోషిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ అనే ప్రక్రియ ఒకసారి అమలు జరిగి ఆగిపోయింది కాబట్టి దానిని పరిశీలించి సంపూర్ణంగా అమలు చేయాలని ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాను. మేము ఏ కులాన్ని, వర్గాన్ని ద్వేషించే వాళ్ళం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు సరైన వాటా దక్కాలని కోరుతున్నాం. జనాభా ఆధారంగా ఫలితాలు అందాలని సోయి పార్టీలకు ప్రభుత్వ పెద్దలకు ఉండాలి.

పైసలున్నోళ్లే ప్రజాప్రతినిధులు

‘పైసలు ఉన్నవారు మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలుగుతున్నారు. గుడిసెలో ఉన్నవారికి, వంద కోట్ల బంగ్లాలో ఉన్నవారికైనా ఒకటే ఓటు అని సంబరపడటం కానీ ప్రజాసేవ చేసే అవకాశం అందరికీ రావడం లేదు. దీనిని పోగొట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఇది సంఘాలకు మేధావులకు చైతన్యవంతులకు మాత్రమే ఉంటుంది. సంఘాలను కూడా పార్టీల ముద్ర వేసి నిర్వీర్యం చేస్తున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనేది గుర్తుపెట్టుకుని మనందరం ఐక్యంగా పోరాడాలి. మనలాంటి జాతులందరినీ కలుపుకొని ముందుకు పోవాలి. 26 లక్షల జనాభా ముదిరాజ్.. 7.46 శాతం ఉన్నారు.తెలంగాణలో అతిపెద్ద కులం ముదిరాజ్. 35 నియోజకవర్గాల్లో ముదిరాజులు శాసించే స్థాయిలో ఉన్నారు కానీ ఏం లాభం అని మన మేధావులు అడుగుతున్నారు. రాజకీయాలు పార్టీలు ఏమైనా ఉండవచ్చు కానీ జాతి మనుగడ కోసం న్యాయమైన డిమాండ్ కోసం ముందు ఉండి పని చేస్తాం. ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో నేను కూడా ఉన్నాను.’ అంటూ ఈటల పేర్కొన్నారు.

గురుకులాల్లో సన్నబియ్యం పెట్టాను

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సర్టిఫికెట్ లేని కులాలు కూడా అనేక ఉన్నాయని గుర్తించి అసెంబ్లీ వేదికగా మీటింగ్‌లు పెట్టాను. దిక్కులేని వారందరికీ నేనే దిక్కు అని ప్రకటించాను. నా ఛాంబర్ లో సెంటు వాసన కాదు చెమట వాసన వచ్చినప్పుడు ఎక్కువ పని చేస్తున్నట్టుగా భావిస్తాను అని మా అధికారులకు చెప్పాను. పురుగుల అన్నం తిని నీళ్ల చారు తాగి పెరిగినవాడిని కాబట్టి ఆర్థిక మంత్రిని అయిన వెంటనే నా పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టాలని పాత జీవోలను పీకిపడేసి బీపీటీ సన్నబియ్యం పెట్టాలని ఆదేశాలు ఇచ్చాను.

నేను నా పని చేసుకోలేదు.. నా జాతి కోసం పాటుపడ్డా

‘పదవి వస్తే మేము ఎక్కడి నుంచి వచ్చాము ఆ జాతుల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశాను. 1650 రూపాయల జీతానికి కంటిన్జెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి జీతాలు పెంచాం. మాటలు చెప్పడం సులభం పని చేయడం కష్టం.. కానీ నేను ఎక్కడ ఉన్నా నాకోసం నేను పని చేసుకోలేదు.. ఈ జాతి నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తాను మీ వెంట నేను ఉంటాను. ఇంత పెద్ద జాతి శక్తి సాహసం ఉంది ఎందుకు కాదో చాలెంజ్ చేసి నడిపించండి మీకు నేను అండగా ఉంటాను.’ అంటూ ఈటల పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>