కలం, నిర్మల్ : భూ భారతి (Bhu Bharati) పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల భూములను సెక్షన్ 22ఏలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూ దోపిడీకి పాల్పడుతోందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Maheshwar Reddy) ఆరోపించారు. భూ భారతి, సెక్షన్ 22ఏ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో శనివారం నిర్వహించిన మహా ధర్నాలో ఆయన ప్రసంగించారు. ధరణి పేరు మార్చి భూ భారతి పెట్టినా భూముల దోపిడీ తీరు మాత్రం మారలేదని విమర్శించారు.
రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రైవేట్ భూములను 22ఏలోకి నెట్టి, చీకటి ఒప్పందాలు చేసుకుంటూ 50-50 వాటాలతో బేరసారాలకు దిగుతున్నారని ఏలేటి (Maheshwar Reddy) ఆరోపించారు. గతంలో బ్రిటిష్ రెవెన్యూ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి రెవెన్యూ వ్యవస్థ వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రైవేట్ భూములను 22ఏలో పెట్టి 50-50 ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఇది రేవంత్ ట్యాక్సా.. రేవంత్ – రాహుల్ ట్యాక్సా? అని ప్రశ్నించారు. నిర్మల్ నియోజకవర్గంలోని కంజర్ గ్రామాన్ని మొత్తం సెక్షన్ 22ఏలో పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల ధర్నాలకు ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రతిపక్షాల కోసం ఏర్పాటు చేసిన ధర్నాచౌక్‌లోనే సీఎం, మంత్రులు టెంట్లు వేసుకుని దీక్షలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఏలేటి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, అవినీతి, దోపిడీ పెరిగిపోయాయని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆర్థిక పరిస్థితి అయోమయంగా మారి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే ఏలేటి స్పష్టం చేశారు.
Also Read : బీజేపీ చెత్త కుప్ప కాదు: మురళీధర్ రావు
Follow Us On: X(Twitter)

