కలం, నిర్మల్: గ్రామాలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముధోల్ (Mudhole) ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao Patel) అన్నారు. శుక్రవారం ముధోల్, లోకేశ్వరం మండలాలలో సుమారు రూ.1.50 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎడ్బిడ్ తండాలో రూ.32 లక్షలతో జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ ఆలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అలాగే రూ.40 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ, మహిళా సమైక్య భవనాల నిర్మాణ పనులకు కూడా భూమిపూజ నిర్వహించారు.
ఎడ్బిడ్ గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న ధాన్యం గోదాం పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే.. రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించారు. అనంతరం లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, మరో రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. కనకాపూర్ గ్రామ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని తెలిపారు. అర్హులైన వారికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, ఆయా మండలాల బీజేపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

