కలం, తుర్కపల్లి : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీకి ప్రజల మద్దతు మరింత పెరగాలని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర శుక్రవారం తుర్కపల్లి మండల (Turkapally Mandal) కేంద్రంలో ప్రారంభమై ముల్కలపల్లి, వాసాలమర్రి, గోపాలపురం, తిరుమలాపురం, గంధమల్ల, ఇబ్రహీంపురం, దత్తాయిపల్లి గ్రామాలలో జాత పర్యటించి సభలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ప్రజల ఆదాయాలు మాత్రం పెరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, డీహెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షురాలు ఇంజ హేమలత, సిపిఐ మండల కార్యదర్శి సిల్వర్ దుర్గయ్య సహాయ కార్యదర్శి గుంటుపల్లి సత్తయ్య పాల్గొన్నారు.

