కలం, హనుమకొండ : దర్గా రోడ్ సమస్య దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రజాప్రతినిధులు, దర్గా పెద్దలు, అధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం లభించిందని, నెల రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Naini Rajender Reddy) తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 48వ డివిజన్ పరిధిలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు.
అలాగే దర్గా ఉత్సవాల సందర్భంగా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.30 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కూడా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాజీపేట్ ఆర్‌ఈసీ రోడ్ అభివృద్ధికి సుమారు రూ.20 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
అభివృద్ధిని అడ్డుకునే శక్తులను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన పోతురవేణ శివకుమార్ కుటుంబానికి విద్యుత్ శాఖ మంజూరు చేసిన రూ.5 లక్షల పరిహార చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

