కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో అత్యవసర సేవలను (Telangana Emergency Services) ఒకే గొడుకు కిందికి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంబులెన్స్, పోలీస్, ఫైర్ సేవలకు 112 అనే ఒకే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ డయల్ 112 (Dial 112) సేవలను డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలపై ఒత్తిడి తగ్గించి, మరింత వేగంగా తక్షణ సహాయం అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని డీజీపీ తెలిపారు. పోలీసులు, ఫైర్, అంబులెన్స్, ఇతర విపత్తు సంబంధిత సహాయానికి వేర్వేరు నెంబర్లకు కాల్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఈ డయల్ 112 వ్యవస్థలో ఎమర్జెన్సీ కాల్ వచ్చిన వెంటనే ముందుగా కాలర్ లొకేషన్ గుర్తిస్తారు. సమీప రెస్పాన్స్ బృందాలకు వెంటనే సమాచారం చేరుతుంది. 365 రోజులు, 24 గంటల పాటు ఈ అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రమాదాలు, నేరాలు, వైద్య సేవలకు అత్యవసర సాయం అందిస్తారు. బంజారా హిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో ఏర్పాటు చేసిన 112 కాల్ సెంటర్ తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో పని చేస్తుందని డీజీపీ వెల్లడించారు.

