కలం, నిర్మల్: చిన్న వయస్సులోనే అసాధారణ ప్రతిభ కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (India Book of Records) స్థానం సంపాదించిన నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన చిన్నారి నాలం నిధ్యానను (Nidhyana) బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Maheshwar Reddy) అభినందించారు. సోమవారం చిన్నారి తన తల్లిదండ్రులు నాలం శ్రవణ్ కుమార్, గౌతమితో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిధ్యానను శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు.
కేవలం ఐదేళ్ల వయస్సులోనే రెండు చేతులతో విడివిడిగా ఇంగ్లీష్ పెద్ద, చిన్న అక్షరాలు, తెలుగు అచ్చులు, హిందీ అచ్చులతో పాటు 1 నుంచి 10 వరకు సంఖ్యలను కేవలం పది నిమిషాల్లో రాసి తన ప్రతిభను చాటుకుంది. ఈ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడంతో పాటు ‘ఐబీఆర్ అచీవర్’ బిరుదును అందుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే ఇంతటి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులతో పాటు నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, బీజేపీ నాయకుడు జమాల్ పాల్గొన్నారు.
Also Read : ఓపికగా బ్యాటింగ్ చేయడమే ముఖ్యం: రవిశాస్త్రి
Follow Us On : WhatsApp

