కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడి మిశ్రమంలా ఉందని సిపిఐ శాసనసభా పక్షం నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ పై ఆయన స్పందిస్తూ తెలంగాణ రూ.8.64 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. దీంతో పాటు మరో లక్ష కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ లెక్కలు ఈ బడ్జెట్ చూపించలేదని పేర్కొన్నారు. ఇంత డబ్బు ఎలా తీసుకువస్తారనేది పెద్ద ప్రశ్న? ఈ దశలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే కత్తి మీద సాము లాంటిదని, ఎవరూ కూడా చేయగలిగిందేమీ లేదన్నారు. ఉన్న దాంట్లో కొంచెం కష్టమైన, క్లిష్టమైన స్థితిలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చేదు, తీపిల మిశ్రమంగా భావిస్తున్నామని కూనంనేని (MLA Kunamneni Sambasiva Rao) చెప్పారు.
ఈ బడ్జెట్ 1 కోటి 50 లక్షల కుటుంబాలకు కుటుంబ జీవిత భీమా సౌకర్యం కల్పించడం మంచి పరిణామమని, కుటుంబంలోని ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వస్తుందని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామనడం మంచి పరిణామమని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ కార్డులు అందించి, నగదు రహిత వైద్యం సౌకర్యం కలించడంతో 23.5 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే పెన్షనర్లు, ఉద్యోగులకు ప్రమాదం జరిగితే రూ. 1.20 కోట్ల భీమా వర్తింపజేయడం, 60 సంవత్సరాలు నిండిన తర్వాత సహాజ మరణం పొందితే రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించడం ఆ కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.
విద్యకు కనీసం 20 శాతం నిధులు కేటాయించాలి..
విద్యా రంగానికి సంబంధించి పాత బడ్జెట్ తో పోల్చితే ఏమి మెరుగ్గా లేదని కూనంనేని సాంబశివరావు అన్నారు. గత బడ్జెట్ విద్యకు 7.57 శాతం నిధులు కేటాయిస్తే, ఈ బడ్జెట్ 8.22 శాతం కేటాయించారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ విద్యకు కనీసం 20 శాతం అయిన నిధులు కేటాయించాలని విద్యావేత్తలు చెబుతున్నారనీ, కానీ విద్య, వైద్య రంగాల్లో నిధుల కేటాయింపులో ప్రభుత్వం ఫెయిల్ అయిందని భావిస్తున్నామన్నారు. హైదరాబాద్ ఉన్నత విద్య, స్పోర్ట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ వంటి వాటిపై కొంత ఫోకస్ పెడుతున్నారు, కానీ కింది స్థాయికి వెళితే మాత్రం యూనివర్సిటీలలో కనీసం ప్రొఫెసర్లు, టీచర్లు, లెక్చరర్ల నియామకం కూడా చేపట్టడం లేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో నెట్టుకొస్తున్నారు, అందువల్ల విద్యరంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు.
వైద్య రంగానికి 10 శాతం నిధులు కేటాయించాలి..
వైద్య రంగానికి సంబంధించి బడ్జెట్ 4.2 శాతం మాత్రమే నిధులు కేటాయించారని, కనీసం 10 శాతం అయిన కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా చూస్తే బడ్జెట్ కొన్ని అంశాలు మంచిగా ఉన్న, కొన్ని అంశాలు ఇంకా ప్రజల అబిష్టానికి అనుగుణంగా లేవన్నారు.
‘గత బడ్జెట్ రూ.3.04 లక్షల కోట్లు ప్రవేశ పెట్టగా, రివైజ్ అంచనాల్లో రూ.2.81 లక్షల కోట్లకు తగ్గిందన్నారు. అంటే రూ. 22 వేల కోట్లు ఖర్చు చేయలేదు. మార్చి 31 వ తేదీ వరకు మొత్తంగా క్లారిటీ వస్తుంది. ప్రస్తుత బడ్జెట్ రూ. 3.24 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టారు. ఇందులో మళ్లీ అప్పు దాదాపు రూ.58 వేల కోట్ల బడ్జెట్ లోటు చూపిస్తున్నారు. అంటే మళ్లీ అప్పు చేయాల్సిందే. గత బడ్జెట్ రూ. 22 వేల కోట్లు తగ్గినట్టుగానే ఈ బడ్జెట్ కూడా సుమారు రూ. 45 వేల కోట్లు తగ్గే అవకాశం ఉంది. అంటే ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్ ఆడంబరంగా అంకెల్లో కనిపించే బడ్జెట్, వాస్తవికంగా వచ్చే సరికి డబులు సరిపోవట్లేదు. ఈ బడ్జెట్ పేద వారి ప్రస్తావన ఎక్కడ కనిపించలేదు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆర్ టి సి ఉద్యోగులు, జర్నలిస్టులు, కాంట్రాక్టు కార్మికులు, జెన్ కో సింగరేణి, జర్నలిస్టుల ప్రస్తావన లేకపోవడం దారుణం. పాత బడ్జెట్ యధాతధంగా కొత్త బడ్జెట్ ఎక్కించారు. కొద్దిగా పెంచుకుంటూ వెళ్లారు. కానీ, పైన పేర్కొన్న వారి పరిస్థితి ఏంటి? పరిష్కారం ఎలా?’ అని కూనంనేని ప్రశ్నించారు. అంతిమంగా రూ. 8.64 లక్షల కోట్ల అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కచ్చితంగా అవసరముందని. లేకపోతే ‘చల్తీ కా నామ్ గాడీ తరహాలో ప్రభుత్వ పరిపాలను సాగుతుంది అని కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

