కలం, వెబ్ డెస్క్: ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం ప్రారంభదశలోనే ఉన్నా ఎండలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. మార్చి మొదటి రెండు వారాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ మార్క్‌ను దాటేశాయ్. మేలో హెచ్చరికలు చేయాల్సిన అధికారులు మార్చిలోనే డ్యూటీ ఎక్కేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోండంటూ రోజూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటిని చల్లగా ఉంచుకోవడం చాలా మంది ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. ఇల్లు చల్లబడాలంటే ఏసీ ఉండాలి. ఏసీ ధరలు చూస్తే ఎండలను మించి మండిపోతున్నాయి. దీంతో ఏసీ లేకుండా ఇంటిని ఎలా చల్లగా చేసుకోవాలన్నది కీలకంగా మారింది. ఈ సమ్మర్ టిప్స్ (Summer Tips) పాటిస్తే ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.
చాలా మంది జేబుకు చిల్లు పడేలా ఉన్నా.. పరిస్థితుల దృష్ట్యా ఏసీ వైపు అడుగులు వేస్తారు. ఖర్చు, భారీ విద్యుత్ బిల్లులు పెరుగుతాయని తెలిసినాా చేసేదేమీ లేక ఈ నిర్ణయానికి వస్తుంటారు. దానికి తోడు చాలా వరకు అద్దె ఇళ్లలో వాటిని అమర్చడం అందరికీ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలు, స్మార్ట్ పరికరాల ద్వారా వేసవిని తట్టుకోవడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
ఏసీలకు ప్రత్యామ్నాయాలు:
ఏసీలకు అత్యంత చేరువలో ఉండే ప్రత్యామ్నాయం ఎయిర్ కూలర్. ఇవి తక్కువ విద్యుత్తును వినియోగిస్తూ గదికి అవసరమైన చల్లదనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే, సాధారణ ఫ్యాన్ల కంటే బిఎల్డిసి (BLDC) ఫ్యాన్లు, హై-స్పీడ్ సీలింగ్ ఫ్యాన్లను వాడటం వల్ల గాలి కాస్తంత ఎక్కువగా వస్తుంది. అద్దె ఇంట్లో ఉండేవారికి పోర్టబుల్ ఏసీలు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, వాటి ధర, విద్యుత్ వినియోగం కాస్త ఎక్కువే.
పురాతన, సహజ సిద్ధమైన చిట్కాలు
సాంకేతిక పరికరాలు లేకపోయినా కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా వేడిని తగ్గించవచ్చు. కిటికీలకు తడి పరదాలు లేదా ఖుస్ పరదాలు కట్టడం వల్ల గదిలోకి వచ్చే గాలి చల్లబడుతుంది. ఫ్యాన్ ముందు ఐస్ ముక్కలు లేదా చల్లటి నీటిని ఉంచడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. రాత్రి వేళల్లో, తెల్లవారుజామున కిటికీలు తెరిచి ఉంచడం ద్వారా ఇంట్లోకి తాజా గాలి వస్తుంది.
జీవనశైలిలో చిన్న మార్పులు
వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఉండాలంటే సింథటిక్ దుస్తులకు బదులు కాటన్ బెడ్‌షీట్లు, దిండు గలఫ్‌లు వాడటం ఉత్తమం. వెదురు చాపలు వేడిని గ్రహించవు కాబట్టి నిద్రకు అనువుగా ఉంటాయి. పగటిపూట మందపాటి పరదాల ద్వారా సూర్యరశ్మిని అడ్డుకోవడం, వేడిని పుట్టించే లైట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించడం వంటివి గది ఉష్ణోగ్రత పెరగకుండా చూస్తాయి.
ప్రాంతాన్ని బట్టి పరిష్కారం
భారతదేశంలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, పొడి ప్రాంతాల్లో కూలర్లు బాగా పనిచేస్తాయి. అదే తేమ ఎక్కువగా ఉండే కోస్తా నగరాల్లో గాలి ప్రసరణ (Airflow) పెంచే ఫ్యాన్ల వాడకం మెరుగ్గా ఉంటుంది. కేవలం ఒకే రకమైన ఖరీదైన పరికరంపై ఆధారపడకుండా, ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారా ఈ వేసవిని హాయిగా గడపవచ్చు. ఏదేమైనా, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన ఇంటిని స్మార్ట్ పద్ధతుల్లో తీర్చిదిద్దుకోవడం వేసవిని ఎదుర్కోవడంలో కీలకం.

