కలం, భువనగిరి : పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు వారి ముఖాల్లో ఆనందాన్ని చూడడం అత్యంత తృప్తినిచ్చే విషయమని భువనగిరి ఎమ్మెల్యే (Bhuvanagiri MLA) కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ముఖ్య అతిథులుగా హాజరై, లబ్ధిదారుల సమక్షంలో ఇండ్లను ప్రారంభించారు.
నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న లబ్ధిదారులకు వారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు సాంప్రదాయబద్ధంగా లబ్ధిదారులకు పట్టు వస్త్రాలను సమర్పించి ఆశీర్వదించారు. నూతన ఇందిరమ్మ గృహాల్లోకి అడుగుపెడుతున్న కుటుంబాలన్నింటికీ భవిష్యత్తులో అంతా శుభం జరగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవైస్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేశ్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

