Mobile Popup Ad
Mobile Popup Ad

రసవత్తరంగా పటాన్ చెరు రాజకీయం.. ఆ ఇద్దరి ఫోకస్ మొత్తం అటువైపే

కలం, మెదక్ బ్యూరో: ఒక‌రు పార్ల‌మెంటు స‌భ్యుడు.. మ‌రొక‌రు శాస‌న మండ‌లి స‌భ్యుడు. కానీ, ఇద్ద‌రు త‌దుప‌రి టార్గెట్ కోసం ముంద‌స్తుగా పావులు క‌దుపుతున్నారు. మెద‌క్ ఎంపీ ర‌ఘ‌నంద‌న్ రావు (Raghunandan Rao) , ప‌ట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి (Anji Reddy) ప‌టాన్ చెరు (Patancheru) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గమే టార్గెట్‌గా బ‌లం పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు, విస్తృత‌ కార్య‌క్ర‌మాలు చేస్తూ ప‌టాన్ చెరులో బీజేపీ (BJP) రాజ‌కీయ వేడికి ర‌గిలిస్తున్నారు.

ఎంపీ కార్య‌క్షేత్రం

మెద‌క్ ఎంపీగా ఉన్న ర‌ఘునంద‌న్ స్వగ్రామం దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం బొప్ప‌పూర్, దుబ్బాక నుండి ప‌లు మార్లు పోటీ చేసి 2020 ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత 2023 ఎన్నిక‌ల్లో ఓడిపోయి, 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ నుండి గెలిచి ఎంపీగా కొన‌సాగుతున్నారు. ఆ ఎన్నిక‌ల్లో ర‌ఘ‌నంద‌న్ గెలిచిన‌ప్ప‌టికీ, ఆయ‌న ఎమ్మెల్యేగా ప‌ని చేసిన దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 15 వేల పై చిలుకు ఆధిక్యం వ‌చ్చింది. ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక ప‌రిస్ధితుల్లో గెలిచినా దుబ్బాకలో తిరిగి స‌త్తా చాట‌లేక‌పోయాడు. అప్ప‌టి నుండి ర‌ఘ‌నంద‌న్ రావు దుబ్బాక కాకుండా త‌న‌కు సేఫ్‌గా ఉండే మ‌రో అసెంబ్లీ స్థానం కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు. అందుకు త‌న ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నాడ‌ని చెబుతున్నారు.

మెద‌క్ పార్ల‌మెంటు ప‌రిధిలో పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం తనకు అన్ని ర‌కాలుగా క‌లిసి వ‌స్తుంద‌ని లెక్క‌లెసుకున్న ఎంపీ నేరుగా రంగంలోకి దిగడానికి సిద్ధ‌మ‌య్యార‌ని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఎంపీ రఘునందన్‌రావుకు ఉద్యోగ, రాజ‌కీయ జీవితాన్నిచ్చింది ప‌టాన్ చెరువు ప్రాంత‌మే. పటాన్‌ చెరు కేంద్రంగా చేసుకునే ర‌ఘునంద‌న్ రావు టీచర్‌గా, జర్నలిస్టుగా, అడ్వకేట్‌గా, రాజకీయ నాయకుడిగా ముప్పై ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో అనుబంధం పెంచుకున్నారు. దీంతో ప‌టాన్ చెరువు నియోజకవర్గంపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప‌టాన్ చెరు నియోజకవర్గం స్ధానికుడైన‌ కాంగ్రెస్ అభ్య‌ర్ధి నీలం మ‌ధు పోటీలో ఉన్న‌ప్ప‌టికీ, ర‌ఘ‌నంద‌న్ రావుకు మంచి మెజార్టీ వ‌చ్చింది. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్ధితులు కుడా త‌న‌కు అనుకూలంగా ఉంటాయ‌ని భావించిన ర‌ఘ‌నంద‌న్ భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌కు ప‌టాన్ చెరును కేంద్రంగా చేయాలనే నిర్ణ‌యం వ‌చ్చిన‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెబుతుంటారు.

దీంతో ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి ఎంపీగా మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల కంటే ప‌టాన్ చెరులో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అడిగిందే త‌డ‌వుగా నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ప్ర‌భుత్వ, ప్రైవేటు కార్య‌క్ర‌మాల‌ల్లో విరివిగా పాల్గొంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రఘునందన్‌రావు. దుబ్బాక నియోజకవర్గ నేతలతో పాటు పటాన్ చెరు నియోజకవర్గ నేతలకు సైతం సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. నియోజకవర్గంలో తరుచుగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ, బీజేపీ క్యాడ‌ర్‌ను యాక్టీవ్‌ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. దీంతో ఎంపీ రఘునందన్‌ ఈసారి పటాన్‌ చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశముందని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

ఎమ్మెల్సీ అంజిరెడ్డి లోక‌ల్

మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప‌టాన్ చెరు నియోజకవర్గ స్ధానికుడు. రామ‌చంద్రపురం నివాసి, పారిశ్ర‌మిక వేత్త‌గా అయిన అంజిరెడ్డి చాలా కాలంగా ఎస్ఆర్ ట్ర‌స్ట్ ద్వారా ప‌లు స్వచ్చంద సేవా కార్య‌క్ర‌మాల‌ను చేస్తూ ఎమ్మెల్యే అవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల బ‌రిలో కుడా స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా గతంలో నిల్చున్నాడు. వివిధ పార్టీలు మారిన‌ప్ప‌టికీ ప‌టాన్ చెరు కేంద్రంగా రాజ‌కీయాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఆయన సతీమణి గోదావరి సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. దీంతో పార్టీ బలానికి తోడు బీజేపీ పార్టీ త‌ర‌ఫున‌ పట్టాభ‌ద్రుల స్ధానం నుండి ఎమ్మెల్సీగా గెలవడంతో ఊపు మీద ఉన్నారు అంజిరెడ్డి. నిన్నా మొన్నటి వరకు రాష్ట్ర కార్యాలయానికే పరిమిత‌మ‌య్యారు అంజిరెడ్డి, గ‌త కొన్ని రోజులుగా ప‌టాన్ చెరువు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో పాటు, ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైన ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

బొల్లారం మున్సిపాలిటీ మార్నింగ్ వాక్ , ప‌టాన్ చెరువు మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిట‌ల్ కోసం పోరాటం, గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్ల‌పై ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఎమ్మెల్యే టార్గెట్‌గా తన సతీమణితో కలిసి క్షేత్ర‌స్ధాయి వరుస పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ల‌క్ష్యంగా గెల‌వ‌డానికి అందివ‌చ్చిన అవ‌కాశంగా భావించి రాష్ట్ర స్థాయి నేత నుండి లభించిన హామీ మేరకే అంజిరెడ్డి నియోజకవర్గంపై దృష్టి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగం ప‌టాన్ చెరువు నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి తనకు అనుకూలమైన వారికే పార్టీ పదవులిస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎంద‌రు బ‌రిలో పోటీలో ఉన్న స్ధానికుడైన తమ నాయ‌కుడికే అవ‌కాశం వ‌స్తుంద‌ని అంజిరెడ్డి అనుచ‌రులు చెప్పుకుంటున్నారు.

ఎందుకు ప‌టాన్ చెరు?

మినీ ఇండియాగా పేరున్న పారిశ్రామిక ప్రాంతం ప‌టాన్ చెరు కుడా భౌగోళిక, సామ‌జిక, రాజ‌కీయాల దృష్ట్యా బీజేపీకి అనుకూలంగా ఉంటుంద‌ని అనుకుంటున్నారు. ఇక్కడి పరిశ్రామిక వాడ‌ల్లో కార్మికులు అన్ని రాష్ట్రాల నుంచి వ‌చ్చి ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భార‌త‌దేశానికి చెందిన కార్మికుల కుటుంబాలు పెద్ద ఎత్తున నివాసం ఉంటారు. హైద‌రాబాద్ శివారులో ఉన్న ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం దాదాపు గ్రేటర్‌ హైదరాబాద్‌లోపైగా విలీన‌మై పట్టణ ప్రాంతంగా మారింది . పట్ట‌ణ ప్రాంత ఓట‌ర్ల, నార్త్ ఇండియా ఓట‌ర్ల ఎక్కువ‌గా ఉండ‌టంతో బీజేపీ నేతలు ప‌టాన్ చెరు నియోజకవర్గంపై అన్ని విధాలా క‌లిసి వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు . బీజేపీ బ‌లం పెంచుకోవ‌డంతో పాటు, ఎంపీ, ఎమ్మెల్సీ ప‌దవుల ద్వారా విస్తృతంగా క్షేత్ర‌స్ధాయిలో ప‌ర్య‌టిస్తూ జ‌నాల‌కు ద‌గ్గర ఉంటూ ప‌ని చేస్తే గెలుపు దక్కుతుందని అంచనా వేస్తున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప‌టాన్ చెరు నియోజకవర్గంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టి, ఏలాగైనా పట్టు సాధించాలని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక‌వైపు ఎంపీ, మ‌రోవైపు స్ధానికుడైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి త‌మ సొంత బ‌లం పెంచుకోవ‌డానికి ప్ర‌యత్నం చేస్తుండ‌టంతో బీజేపీ స్ధానిక‌ క్యాడ‌ర్ అయోమ‌యంలో ప‌డ్డారు. పార్టీ కోసం ప‌ని చేసేదా లేదా ఎంపీ, ఎమ్మెల్సీల కోసం ప‌ని చేయాలా అర్ధం కాక కాషాయ కార్య‌క‌ర్త‌లు న‌లిగిపోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>