కలం, మెదక్ బ్యూరో : చేగుంట (Chegunta) పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు అధికంగా ఉన్నందున ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే ఫైర్ స్టేషన్ (Fire Station) ఏర్పాటు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చేగుంటలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిన ధనలక్ష్మి హార్డ్వేర్ షాపును ఎమ్మెల్యే పరిశీలించి, బాధిత వ్యాపారులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 నుంచి రూ.60 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలిపారు.
చేగుంట పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే చేగుంటతో పాటు చుట్టుపక్కల 30 నుంచి 40 గ్రామాలకు అగ్నిమాపక సేవలు తక్షణమే అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడి ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజన్, సిబ్బంది ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ మంజూరు చేయడంతో పాటు అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధిత వ్యాపారులను ఆదుకోవాలని కోరారు.

