కలం, ఇచ్చోడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లు, ప్రాథమిక ఓటు హక్కుతోనే ఎమ్మెల్యే అయ్యానని బోథ్ శాసనభ్యుడు అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. ఇచ్చోడ మండలం దాబ (కే) గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసి మాట్లాడారు. దేశంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలనే సంకల్పంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అంబేడ్కర్ రచించారని కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి గ్రామం నుంచి అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులు తయారు కావాలని పిలుపునిచ్చారు.
దాబ (కే) గ్రామస్థులు ఎస్సీ కేటగిరీలో ఏర్పాటు చేసిన రోస్టర్ విధానంపై తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రోస్టర్ విధానం వల్ల కేటగిరీ-1, కేటగిరీ-2లో కేటాయించిన మహార్, మాల సంఘాలకు రిజర్వేషన్ల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించినట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

