కలం, స్పోర్ట్స్: ట్రోఫీ గెలిచిన ఆనందం కొద్దిసేపటికే ఆందోళనగా మారింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియాండ్రో పరేడెస్ (Leandro Paredes) లైవ్ ఇంటర్వ్యూలో ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలాడు. వైద్య సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉంది. కొలంబియాలోని బర్రాన్క్విల్లాలో బోకా జూనియర్స్, అట్లెటికో మినీరో మధ్య కోపా సుడామెరికానా ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బోకా జూనియర్స్ 2-0తో విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. అనంతరం పరేడెస్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మాట్లాడుతుండగానే అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని చికిత్స అందించారు. కొద్దిసేపటికే తేరుకున్న పరేడెస్ తనంతట తానుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. అయితే, ఈ ఘటనపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరేడెస్ సోషల్ మీడియా ద్వారా భరోసా ఇచ్చాడు. కేవలం కళ్లు తిరగడం వల్లే ఇలా జరిగిందని తెలిపాడు.
మ్యాచ్ సమయంలోనూ పరేడెస్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. బర్రాన్క్విల్లాలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో 58వ నిమిషంలోనే మైదానాన్ని వీడాడు. తొలి అర్ధభాగం చివర్లోనే అతడికి కళ్లు తిరిగినట్లు అనిపించిందని బోకా కోచ్ రోడోల్ఫో అరువబరెనా వెల్లడించాడు.

