కలం, కరీంనగర్ బ్యూరో: సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Kavvampally Satyanarayana) మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోందన్నారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ప్రభుత్వ భూములను చెరబట్టిన బీఆర్ఎస్..
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కుటుంబం ప్రభుత్వ భూములను ఆక్రమించిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. అప్పటి పాలనలో అండదండలతో పలువురు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌కుమార్ తదితరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
ఇక్కడి మాజీ ఎమ్మెల్యే కూడా అటవీ శాఖకు చెందిన ఐదు ఎకరాల భూమిని ఆక్రమించినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత నేతలు ఆక్రమించినట్లు ఆరోపిస్తున్న భూముల్లో కొన్ని రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22-ఏ పరిధిలో ఉన్నాయని తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయవిక్రయాలు చెల్లవని పేర్కొన్నారు. అందుకే బీఆర్‌ఎస్ నేతలు 22-ఏ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నేతలకు సంబంధించిన భూ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయని, అక్రమంగా ఉన్నట్లు తేలిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు.
పలు అభివృద్ధి పనులు..
ముస్కానిపేట గ్రామంలో వీవో భవనం, అంగన్‌వాడీ భవనాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న చిరుధాన్యాల గోదాం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఎస్సీ కాలనీలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు కూడా భూమిపూజ నిర్వహించారు.
డ్రైనేజీ పనులకు భూమిపూజ..
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. బస్టాండ్ పరిసరాల్లో నెలకొన్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ముస్కానిపేట గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇల్లంతకుంట ప్యాక్స్ చైర్మన్ ఉట్కూరి వెంకటరమణారెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, పార్టీ నాయకులు ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, గుడిసె ఐలయ్య, పసల వెంకటి, ఎలగందుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

