కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో రాజధాని ఏసీ బస్సు (Rajadhani Bus) లో సాంకేతిక లోపం తలెత్తి ఎమర్జెన్సీ అలారం మోగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇటీవల కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాల నేపథ్యంలో ఈ ఘటన ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిచింది.
కరీంనగర్ ఆర్టీసి డిపో-1కి చెందిన ‘రాజధాని’ ఏసీ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అయితే బస్సు తిమ్మాపూర్ సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎమర్జెన్సీ అలారం మోగింది. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. ఎంతసేపటికి అలారం ఆగిపోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ప్రమాదాలు చోటుచేసుకోవడం, అంతేకాకుండా గతంలో తిమ్మాపూర్ వద్దే ఒక ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమయిన ఘటనలు ప్రజల కళ్ల ముందు మెదలడంతో డీజిల్ ఏసీ బస్సులో కూడా ఇలా అలారం మోగడం వారిని మరింత వణికిపోయేలా చేసింది.
దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరో బస్సును ఏర్పాటు చేయాల్సిందిగా కోరడంతో ప్రయాణికులు బస్సు దిగి రోడ్డుపైకి చేరుకున్నారు. అయితే ప్రత్యామ్నాయ బస్సు రావడంలో ఆలస్యం జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిన ప్రయాణికులు తమ ఫ్లైట్ మిస్ అవుతుందేమోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డిపో మేనేజర్ స్పందించడం లేదని, బస్సు ఆలస్యంపై అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాచారం ఇవ్వట్లేదని ప్రయాణికులు మండిపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తాము సమయానికి గమ్య స్థానాలకు చేరుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు అరగంట ఆలస్యంగా మరో బస్సు రావడంతో ప్రయాణికులంతా అందులోకి మారి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. పెద్ద ప్రమాదం ఏదీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

