కలం, వెబ్ డెస్క్: పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న తెలుగు చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగదుర్గ కథానాయికగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో ఆమె వెండితెరకు అరంగేట్రం చేస్తున్నారు. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం విడుదల చేసిన టీజర్ (Teaser) అంచనాలను మరింత పెంచింది.
వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అండ్ బన్నీవాస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. సురేష్ బొబ్బిలి అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’, ‘గడప’, ‘బరాత్ బీట్’ పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామీణ వాతావరణం, సంప్రదాయాలు, కుటుంబ బంధాలను ప్రతిబింబించేలా టీజర్ ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

