ఆంధ్రప్రదేశ్‌ను మీ కార్పొరేట్ హోమ్‌గా మార్చుకోండి: నారా లోకేశ్

కలం, వెబ్‌ డెస్క్ : ప్రపంచ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌ను కేవలం సందర్శించి వెళ్లకుండా, ఇక్కడ పెట్టుబడులు పెట్టి, నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనతో పాటు తమ సంస్థల ప్రధాన కార్యాలయాలను కూడా ఏపీకి (AP) తరలించి రాష్ట్రాన్ని తమ కార్పొరేట్ హోమ్‌గా (Corporate Home) మార్చుకోవాలని కోరారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో ప్రారంభమైన సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సులో ఆయన ప్రసంగించారు.

పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి తాను, ముఖ్యమంత్రి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. వ్యాపార నిర్వహణలో వేగం, విధానాల్లో స్థిరత్వం, సేవల్లో నాణ్యత తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని వివరించారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణకు త్వరలో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురానున్నట్లు ప్రకటించారు. పరిశ్రమలకు ప్రకటించిన ప్రోత్సాహకాలు నేరుగా అందించేందుకు ఎస్క్రో ఖాతాల విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రానికి ఉన్న సుమారు వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం, పోర్టులు, విమానాశ్రయాలు, మెరుగైన రవాణా సదుపాయాలు పెట్టుబడులకు అనుకూలమని పేర్కొన్నారు. 2024 జూన్ నుంచి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో రూ.17.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు అనుమతులు లభించాయని తెలిపారు. రూ.5.9 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న 15 బిలియన్ డాలర్ల ఏఐ హబ్ రాష్ట్రానికి కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని చెప్పారు.

రేమండ్స్, ప్రీమియర్ ఎనర్జీస్, ఎస్‌ఎస్‌డీ పాలిమర్స్ సంస్థల అభివృద్ధిని ఉదాహరణలుగా ప్రస్తావిస్తూ పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. నైపుణ్యం కలిగిన యువత, ప్రశాంతమైన జీవన వాతావరణం, భవిష్యత్ సాంకేతిక ప్రాజెక్టులు ఏపీ ప్రత్యేకతలని పేర్కొంటూ ప్రపంచ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>