నిర్మల్‌లో బీజేపీ మహాపాదయాత్ర.. ఏర్పాట్లు పరిశీలించిన ఏలేటి

కలం, నిర్మల్: ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ)పై కాంగ్రెస్‌, ఇండీ కూటమి చేస్తున్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, తమ వాదనను వినిపించేందుకు బీజేపీ కార్యాచరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నవంబర్ 3న నిర్మల్ జిల్లా కేంద్రంలో మహా పాదయాత్ర (BJP Maha Padayatra) నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పాదయాత్రను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

కార్యక్రమానికి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్య అతిథి హెలికాప్టర్‌లో రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అనంతరం పార్టీ నాయకులతో ఏర్పాట్లపై సమీక్షించి, కార్యక్రమం విజయవంతానికి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నవంబర్ 3న జరిగే మహా పాదయాత్ర ద్వారా ఎస్‌ఐఆర్‌ అంశంపై ప్రజలకు తమ అభిప్రాయాలను వివరించడంతోపాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీ నేతలు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి సుమారు 50 వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే గ్రామాల వారీగా పార్టీ సర్పంచులు, నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ జనసమీకరణపై దిశానిర్దేశం చేస్తున్నారు.

గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను సమాయత్తం చేస్తూ పాదయాత్ర (BJP Maha Padayatra) విజయవంతానికి కార్యాచరణ అమలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో సునీల్ బన్సల్ తొలిసారిగా నిర్మల్‌కు రానుండటం ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో పాదయాత్రను విజయవంతం చేసేందుకు కమలం పార్టీ నేతలు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.

ఈ పరిశీలనలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజి నరేష్, జింక సురేందర్, కూన శశాంక్, సూరజ్ నాయక్, నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రమణారెడ్డి, సరికెల గంగన్న, శ్రీనివాస్, ధర్మాజీగారి ఈశ్వర్, కందుల హరీష్, భరత్, సాయి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>