తన నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు బాగాలేవలంటూ కల్వకుర్తి(Kalwakurthy) కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి(Narayana Reddy) విమర్శించారు. బుధవారం ఆయన నియోజకవర్గ పరిధిలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యసిబ్బంది తీరును తప్పుపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో ప్రాణాలు పోతున్నాయని విమర్శించారు. ఇటీవల వెల్దండ సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరిగాయని.. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతోనే ప్రాణాలు పోయాయని గుర్తు చేశారు.
వైద్య సిబ్బంది ఫీల్ అయినా పర్వాలేదు తాను నిజాలు చెబుతున్నానన్నారు. “ఇది మన సొంత ప్రభుత్వం అని భావించి తప్పుగా అనుకోవచ్చు కానీ వాస్తవం చెప్పకుండా ఉండలేం. ఆసుపత్రిలో సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాల లేమి వల్ల రోగులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని తక్షణమే సీరియస్‌గా తీసుకుని పరిష్కారం చూపాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే(Narayana Reddy) చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత పాలక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమస్యలను బహిరంగంగా వెల్లడించరు. ఆ పని ప్రతిపక్ష నేతలు చేస్తుంటారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే కసిరెడ్డి విమర్శలు చేయడం గమనార్హం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రుల తీరు దయనీయంగానే ఉంటుంది. సరైన వసతులు ఉండవు. సిబ్బంది సరిగ్గా పనిచేయరు. వెరసి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. మరి కసిరెడ్డి చేసిన వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం స్పందిస్తుందా? ఆస్పత్రుల్లో సేవలను మెరుగు పరుస్తుందా? నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: మహిళల ఆస్తి హక్కుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Follow Us on: Youtube

