కలం, వెబ్‌డెస్క్: గతంలో కేసీఆర్ (KCR) ఇతర పార్టీలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారని, వారు చేస్తే రాజకీయం వేరే వాళ్లు చేస్తే వ్యభిచారమా? అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ప్రశ్నించారు. ఇది కేసీఆర్ నేర్పిన విద్యే కదా అంటూ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం మీదికొండలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాడు ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయకుండా 36 మందిని పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చకపోవడం వల్ల, ఆయనకు ఉన్న అహంకారం కారణంగానే పార్టీ నుంచి కొందరు బయటకు వచ్చారని చెప్పారు.
జిల్లాల విభజనపై కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు కేసీఆర్ వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేస్తామంటే వద్దని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లా మొత్తాన్ని ఆగం చేశారన్నారు. తాను కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తే కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారని, మరి కవితకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ ఆగం చేసిందని, పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటున్న కవిత ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

