కలం, మిర్యాలగూడ: అర్హులైనవారికి సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వం లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) స్పష్టం చేశారు. ఆదివారం వేములపల్లి, మాడుగులపల్లి మండలాల లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పేదలు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పెన్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

