కలం, మిర్యాలగూడ: పట్టభద్రుల ఓటు నమోదు (Graduate Voter Registration) ప్రక్రియను రాబోయే మూడు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Laxma Reddy) పిలుపునిచ్చారు. మంగళవారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై నియోజకవర్గ సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత వీడియో కాల్ ద్వారా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. 3 రోజుల్లో నమోదు ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు, మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లు సాధించేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ నెల 6వ తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో మిర్యాలగూడ నియోజకవర్గ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. ప్రజా హామీల అమలు, అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

