కలం, కరీంనగర్ బ్యూరో: నగరాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ.. పారదర్శకతతో మా పాలకవర్గం ముందుకు సాగుతుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా మంగళవారం నగరంలోని 3,5వ డివిజన్లలో పర్యటించారు. రూ. 1.15 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 3వ డివిజన్ తీగలగుట్టపల్లిలో స్థానిక కార్పోరేటర్ సాదినేణి లావణ్య మునింధర్తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన రూ. 38 లక్షల సాధారణ నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేశారు.
అనంతరం 5 వ డివిజన్ సిటిజన్ కాలనీలో స్థానిక కార్పోరేటర్ గాదె రూప శ్రీనివాస్‌తో కలిసి రెండు చోట్ల యూఐడీఎఫ్కు చెందిన రూ. 77 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. చేపట్టిన పనులను త్వరగా ప్రారంభం చేసి నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
నగర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం: మేయర్
ఈ సందర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సూచనల మేరకు మా పాలకవర్గం పారదర్శకత, అభివృద్దే ధ్యేయంగా పని చేస్తుందని తెలిపారు. పాలకవర్గం ఏర్పడి 10 మాసాల్లో నగరాభివృద్ధికి వందల కోట్లు కేటాయించి నగర అభివృద్ధిని నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. యూఐడీఎఫ్ నిధులతో ఒక వైపు, నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మరో వైపు.. 66 డివిజన్లలో అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధికి నోచుకోని విలీన, శివారు ప్రాంతాల డివిజన్ల అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
బొమ్మకల్ ప్రాంతంలోని 5వ డివిజన్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు యూఐడీఎఫ్లో దాదాపు రూ. కోటి కేటాయించామని తెలిపారు. ఇందులో భాగంగానే రూ. 77 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అభివృద్ధి చెందని ప్రాంతాలను అభివృద్ధి వైపు నడిపించి, స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పిస్తున్నట్లు తెలిపారు.
విలీన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
అంతే కాకుండా విలీన గ్రామాల డివిజన్ల ప్రజల త్రాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమృత్ 2.0 పథకంలో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ప్రతి కాలనికీ త్రాగు నీటి పైపు లైన్ నిర్మాణం పనులు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం వాటి పనులు కూడ పురోగతిలో ఉన్నాయని త్వరలోనే విలీన గ్రామాల డివిజన్ల త్రాగు నీరు అందిస్తామని తెలిపారు. మరో 30 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో త్వరలోనే డివిజన్ల వారిగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు.
డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం..
నగర ప్రజలకు సమస్యగా మారిన డంపింగ్ యార్డు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద దాదాపు 17 కోట్లు కేటాయించి బయోమైనింగ్ ప్రక్రియ త్వరలో చేపడుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా యూసీఎఫ్ కింద డంపింగ్ యార్డు ప్రక్షాళన కోసం రూ. 80 కోట్లు కేటాయించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డులో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి సాలిడ్ మేనేజ్మెంట్ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండు విధనాలను పూర్తి స్థాయిలో అమలు చేసి డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.
నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మా పాలకవర్గం పై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ.. ప్రజలను తప్పుదొవ పట్టించే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా పాలకవర్గం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి..
వేసవి కాలం ముగిసినా.. వేసవిని తలపించే ఎండలు మండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ముందస్తు జాగ్రత్తతో వ్యవహారించాలని పిలుపు నిచ్చారు. నగరపాలక సంస్థ ద్వారా సరఫరా చేసే నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. నీటిని వృథా చేయవద్దని, అవసరాల మేరకే వాడుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వినియోగిస్తేనే రాబోయే ముప్పును నివారించవచ్చని పిలుపు నిచ్చారు. నీటి బొట్టును ఒడిసి పట్టేందుకు నగర ప్రజలు ప్రతి నివాసంలో ఇంకుడు గుంతలను నిర్మాణం చేసుకోవాలని అన్నారు. ఇంకుడు గుంతలను తప్పక ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలను పెంచేలే ప్రజలు భాధ్యతగా వ్యవహారించాలని అన్నారు. నగరపాలక సంస్థ ద్వారా కూడా రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ చేపట్టే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
కరీంనగర్‌ను తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలుపుతాం..
కరీంనగర్‌ను తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో తమ పాలకవర్గం ముందుకు సాగుతుందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సలహా, సూచనల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. నగర ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

