కలం, దిలావర్‌పూర్: నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) అన్నారు. దిలావర్‌పూర్ (Dilawarpur) మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు (Development Works) ఆయన శ్రీకారం చుట్టారు. సిర్గాపూర్ గ్రామంలో సీఆర్ఆర్ నిధులు రూ.1.40 కోట్లతో చేపట్టనున్న నూతన బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఫుడ్‌గ్రెయిన్ స్టోరేజ్ గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం బన్సపెల్లి గ్రామంలో రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న గోదాం, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దిలావర్‌పూర్ మండల కేంద్రంలోని పాఠశాలలో పీఎంశ్రీ నిధులు రూ. 27 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన రహదారులు, బ్రిడ్జి నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. గోదాంల నిర్మాణంతో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు వీలవుతుందన్నారు.
విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు దొడ్డికింది ముత్యంరెడ్డి, తక్కల రమణారెడ్డి, జమాల్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, సర్పంచ్ చైతన్య శంకర్‌రెడ్డి, ఉప సర్పంచ్ సాగర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

